ఏదైనా దొంగతనం జరిగితే ఏం చేస్తాం.. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అయితే పోలీస్ స్టేషన్‌లో చోరీ జరిగితే.. అందులో పోలీసుల వస్తువులు దొంగతనం చేస్తే.. విశాఖపట్నం జిల్లాలో అదే జరిగింది. పండుగ రోజు పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ మొబైల్ మాయమైంది.. ఈ ఘటనతో అందరూ అవాక్కయ్యారు. పోలీసులు వెంటనే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది.
దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో.. ఈ నెల 13న భోగి పండుగ కావడంతో సందడి వాతావరణం కనిపించింది. ఓ మహిళా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేస్తున్నారు. ఆమె మొబైల్‌ను స్టేషన్‌లో ఉన్న టేబుల్‌పై పెట్టారు.. అయితే కొద్దిసేపటి తర్వాత చూస్తే మొబైల్ అక్కడ లేదు.. దీంతో ఆమె కంగారుపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి విషయం చెప్పి.. మొబైల్ గురించి ఆరా తీశారు.. అక్కడ వెతికినా లాభం లేకుండా పోయింది. వెంటనే పీఎస్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే కానీ అసలు సంగతి అర్థం కాలేదు. ఓ వ్యక్తి టేబుల్‌పై ఉంచిన మొబైల్‌ను తీసుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. అతడి గురించి ఆరా తీస్తే అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది.
పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి జంక్షన్ దగ్గర పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరందర్ని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.. అయితే పేకాట శిబిరంలో దొరికిపోయినవారికి ష్యూరిటీ కోసం మానేపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆయనే లేడీ కానిస్టేబుల్ మొబైల్ నొక్కేసి అక్కడి నుంచి మెల్లిగా నుంచి జారుకున్నాడు. ఇదంతా పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డైంది. వెంటనే సత్యానారాయణను పట్టుకుని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.. అతడు మొబైల్‌లో సిమ్ కార్డు తీసి పడేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. పోలీస్ స్టేషన్‌కు ష్యూరిటీ కోసం వచ్చి.. ఇలా చోరీ చేసి సీసీ ఫుటేజ్‌తో అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు సత్యనారాయణ.