పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్యపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరైన సందర్భంలో ఈ సంఘం సభ్యునిగా ఉన్న వర్ల మీడియాతో మాట్లాడటంపై నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రమ శిక్షణ సంఘం సభ్యులుగా ఉన్న ఐదుగురు నేతల్లో వర్ల రామయ్య ఒకరు. సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలోనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికి రెండుసార్లు క్రమ శిక్షణ సంఘం ముందు హాజరైన కొలికపూడి ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో నష్టపోతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. రామయ్య వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘క్రమ శిక్షణ సంఘం సభ్యులుగా ఉన్న నేతలు సంయమనం పాటించాలి. విచారణాంశాలపై బయట మాట్లాడకూడదు. తాము ఏ అభిప్రాయానికి వచ్చారో దానిని పార్టీ నాయకత్వానికి నివేదించాలి. అంతేతప్ప మీడియా ముందు ఎలా మాట్లాడతారు? అందరూ మీడియా ముందు మాట్లాడితే ఇక పార్టీ క్రమ శిక్షణకు అర్థమేముంది?’ అని నాయకత్వం అభిప్రాయపడినట్లు సమాచారం. నాయకత్వం అసంతృప్తిని రామయ్యకు తెలియచేశారు. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.