రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబుకు త్వరలో సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో.. ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ఇటీవలే అత్తలూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్‌పీవోను సందర్శించామని, అక్కడ నిర్వహించే కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్‌లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి చుట్టూ 75 లక్షల మొక్కల పెంపకం కోసం రైతులను భాగస్వామ్యం చేసేందుకు కార్యాచరణ చేయనున్నామన్నారు. విజయనగరం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతి సాగు కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తు మాట్లాడుతూ ప్రతి పంటను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే విధంగా, 100 శాతం ఆర్గానిక్ ధ్రువీకరణ పంటల ఉత్పత్తి దిశగా సేంద్రియ ఉత్పత్తులపై త్వరలోనే సీఎంకు సమగ్ర నివేదిక అందజేయనున్నామని తెలిపారు.