టెక్కలి పరిధిలోని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు ప్రాంతాన్ని పెట్రో కెమికల్ హబ్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ ఎలక్ర్టానిక్స్ శాఖ మంతి నారా లోకేశ్ మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మి మిట్టల్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం దావోస్‌లోని బెల్వేడార్‌లో మిట్టల్ గ్రూప్ చైర్మన్‌తో సమావేశమయ్యారు. భావనపాడు, మూలపేట ప్రాంతంలో 826.51 ఎకరాల్లో రూ.4,361.91కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మిస్తున్నామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్‌అండ్‌డీ లాజిస్టిక్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రో కెమికల్స్, గ్రీన్‌ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హెచ్‌పీసీఎల్-మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ హెచ్‌ఎంఈఎల్-హెచ్‌పీసీఎల్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన రూ.3,500కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2జీడబ్ల్యూ సామర్ధ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఇక్కడ నెలకొల్పాలని కోరారు. ప్రభుత్వం తరపున సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనపై మిట్టల్ సానుకూలంగా స్పందించారు. భేటీలో మిట్టల్ గ్రూప్‌నకు చెందిన ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మూలపేట పోర్టు నిర్మాణ ప్రాంతంలో సుమారు ఆరువేల ఎకరాల్లో రూ.1.20 కోట్ల యూఎస్ మిలియన్ డాలర్లతో కోల్‌కత్తాకు చెందిన హల్దియా పెట్రో కెమికల్స్ దృష్టి సారించింది.