బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా సంవత్సర కాలంగా జాతి వైరాలతో నిత్యం దాడులు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో బేజీపీ నేతృత్వంలోని బిరేన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తమకున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని వివరించారు. అయితే ఈ విషయాన్ని నేరుగా మణిపూర్ ముఖ్యమంత్రి క్షేత్రమయం బిరేన్ సింగ్ ప్రకటించారు. అధికారిక లేఖను కూడా విడుదల చేశారు. ఆ పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మణిపూర్‌లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఈ పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అక్కడ జేడీయూ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉన్నారు. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉంది. అయితే జేడీయూ ఉపసహంరణ వల్ల బిరేన్ సింగ్ నేతృత్వంలోని సర్కారుకు ఎలాంటి సమస్యా లేదు.
కాకపోతే కేంద్రంతో పాటు బిహార్‌లో ఎన్డీఏ కూటమిలో కీలక పక్షమైన నితీష్ పార్టీ.. బీజేపీకి కటీఫ్ చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. మణిపూర్ సీఎం నేతృత్వంలోని బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడం వెనుక కారణం ఏంటనేది కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించలేరు. దీంతో అసలు సీఎం నితీష్ అలా ఎందుకు చేశారంటూ ప్రజలంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో ఏడాది కాలంగా జాతుల మధ్య వైరం కొనసాగుతూ.. రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. అయితే అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాంతి, భద్రతలను కాపాడలేకపోయింది.
దీని వల్లే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. అక్కడి బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అలాగే మేఘాలయాలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సైతం కొన్ని నెలల క్రితమే మణిపూప్రలో బీజేపీ ప్రభుత్వానికి కటీఫ్ చెప్పింది. తమ మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే సీఎం నితీష్ కుమార్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.