మహారాష్ట్రలో మరో రైలు దుర్ఘటన జరిగింది. జల్‌గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబైకి ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయని ప్రయాణికులు కేకలు పెట్టారు. దీంతో కొందరు ప్రయాణికులకు భయంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు చైన్ లాగారు. రైలు ఆగకముందే ప్రయాణిస్తుండగానే.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రయాణికులు కిందికి దూకారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలోనే అటు వైపు నుంచి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు అతివేగంగా దూసుకురాగా.. దాని కింద పడి పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
అయితే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగలేదని.. అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. ప్రయాణికులు అనవసరంగా భయపడటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా గుర్తించారు. పట్టాలపై పడిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో వారి మృతదేహాలు ఛిద్రం అయిపోయాయి. వారి తల మొండం వేరు కావడం.. తలలు కూడా రెండు ముక్కలు అయ్యాయి. ఘటనా స్థలంలో ఉన్న కొందరు వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అక్కడి భీతావహ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది.
ఇప్పటివరకు ఈ ఘోర రైలు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడినట్లు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక రైలు ప్రమాదానికి సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ రైలు ప్రమాద ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.