ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి అర్జీలు స్వీకరించారు. కృష్ణా జిల్లా ఉత్తర చిరువోలులంకకు చెందిన ఉప్పాల అనిల్‌కుమార్ ‘మోర్ల మహీధర్ గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. రూ.16 లక్షలు తీసుకుని, మోసం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే కేసు తీసుకోలేదు’ అని వాపోయారు. భీమవరం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఆదినారాయణరెడ్డి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.9.50 లక్షలు తీసుకుని, మోసం చేశారని తాడేపల్లికి చెందిన కేఎస్ ప్రియ ఫిర్యాదు చేశారు. వర్రా సాగర్‌రెడ్డి అనే వ్యక్తి బ్యాంక్‌లో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించాడు. లోన్ ఇప్పిస్తానని నా ఖాతాలోని సొమ్ము కాజేశాడు’ అని గుంటూరుకు చెందిన గంజరపల్లి చిన్నయ్య ఫిర్యాదు చేశారు.