ప్రైవేట్ జూనియర్ కాలేజీల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన ఇంటర్ విద్యార్ధి.. సకాలంలో ఫీజులు చెల్లించలేదని కాలేజీ యాజమన్యం కళాశాలలోకి అనుమతించకుండా గేటువద్దే గంటల తరబడి బయటే నిలబెట్టారు.దీంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అనంతపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ (16) అనే విద్యార్ధి అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి సెలవుల అనంతరం చరణ్‌ను అతడి సోదరుడు గురువారం అతడిని కళాశాలలో విడిచి పెట్టేందుకు వచ్చాడు. ఈ సమయంలో నాయాణణ కాలేజీ యాజమన్యం చరణ్ ఫీజు బకాయి ఉన్నాడని, మొత్తం ఫీజు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, పలు విద్యార్థి సంఘాలు తెలిపారు. ఈ క్రమంలో చాలా సేపటి వరకు చరణ్‌లోను కాలేజీ లోనికి వెళ్లకుండా బయటే నిలబెట్టారు. దీంతో చరణ్ సోదరుడు ఎలాగోలా సర్దిచెప్పడంతో యాజమన్యం లోనికి రానిచ్చారు. ఈ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ గురువారం తరగతులు జరుగుతున్న సమయంలో చరణ్ క్లాస్ రూంలో నుంచి బయటకు వచ్చి అధ్యాపకుడు చూస్తుండగానే మూడో అంతస్తులోని నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు.ఈ ఘటనలో చరణ్ తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. రక్తమోడిన ప్రాంతమంతా గుట్టుచప్పుడు కాకుండా హడావుడిగా శుభ్రం చేసేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ పలువురు విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల యాజమన్యం కూడా ఓ ఇంటర్ విద్యార్ధిపట్ల ఇదే విధంగా అమానుషంగా ప్రవర్తించారు. ఫీజు కట్టలేదని అర్ధరాత్రి వరకు గేటు బయటే నిలబెట్టారు. మీడియతోపాటు పోలీసులకు సమాచారం అందడంతో విద్యార్ధిని లోనికి అనుమతించారు.