రాజమహేంద్రవరం పరిసర ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి-భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ ఇచ్చిన హామిని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే ట్రస్ట్ ద్వారా తమ వంతుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. 100రోజుల శిక్షణకు ఒక్కొక్కరికి రూ.20 వేలు ఖర్చవుతుందని, దానిలో భవాని చారిటబుల్ ట్రస్ట్ రూ.15 వేలు భరిస్తుందని, ఆసక్తి గల యువత రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. మూడు నెలలకు ఒకసారి ఈ బ్యాచ్ ప్రారంభమౌతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించాలనుకోవడం అభినందనీయమన్నారు. శిక్షణకు ఎంపికైన వారికి పత్రాలు అందించారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, అమరావతి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత అనిల్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు.