ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనికులకు రుణమాఫీ.. ఇదో భారీ కుంభకోణం: కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 03:11 PM

బిలియనీర్లు తీసుకున్న రుణాలను కేంద్రప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్, దిల్లీ  మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఆరోపించారు.వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ప్రధాని మోదీకి  ఆయన లేఖ రాశారు. ఆ రుణాల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో పేర్కొన్నారు.'కోటీశ్వరులు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది. వారికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దీంతో సాధారణ ప్రజలు అధిక పన్ను భారాన్ని మోయలేకపోతున్నారు. బిలియనీర్లకు మాత్రం ప్రయోజనం చేకూరుతోంది. పౌరులు తమ జీతాల నుంచి సగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తుంటే.. మోదీ సర్కారు మాత్రం ధనవంతులకు రుణాలు మాఫీ చేస్తోంది'' అని కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.


''సామాన్యులు తీసుకునే గృహ, వాహన ఇతర రుణాలను కేంద్రం ఎందుకు మాఫీ చేయడం లేదు..? ఒకవేళ బిలియనీర్ల రుణమాఫీని ఆపితే.. సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగానికి తగ్గించొచ్చు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయొచ్చు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగించొచ్చు. ధనవంతులకు రుణమాఫీ అనేది భారీ కుంభకోణం. దీనికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది'' అని అన్నారు.కాగా.. త్వరలో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు ఆప్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌, భాజపా అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలపై హామీలు కురిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ధనికుల రుణమాఫీ అంశంపై కేజ్రీవాల్‌ గళమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com