ఏటా జనవరి వచ్చిందంటే జీడి పిక్కల సీజను ప్రారంభమై ఉద్దానం గ్రామాల్లో సందడి నెలకొంటుంది. రైతులు జీడి తోటల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని జీడి పిక్కలను సేకరిస్తుంటారు. వాటిని విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో ఏడాదంతా కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటారు. అయితే, గత ఏడేళ్లుగా జీడి పిక్కల దిగుబడి బాగున్నా, ఆశించిన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
ఎకరా జీడి తోటలో ఫలసాయం పొందాలంటే రూ.15వేల వరకూ పెట్టుబడి అవుతుంది. ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికి అందుతుంది. లేదంటే నష్టపోవాల్సిందే. జిల్లాలో ఉద్దానంతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో 27వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది. ప్రస్తుతం పలాస మార్కెట్‌లో విదేశీ జీడి పిక్కల బస్తా(80 కిలోలు) రూ.14,500 వరకూ పలుకుతుండగా, దేశీయ పిక్కలను మాత్రం రూ.10వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.