ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాల్దీవులకు ఆర్థిక సాయం పెంపు, ఏ ఏ దేశాలు ఉన్నాయంటే

national |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 08:23 PM

తాజా బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు మొత్తంగా రూ.20,516 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వివిధ దేశాలకు సహాయం చేసేందుకు రూ.5483 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించారు. అయితే ఇతర దేశాల సాయం కోసం గతేడాది రూ.5806 కోట్లు కేటాయించగా.. ఈసారి కొంత తగ్గించడం గమనార్హం. ఈ క్రమంలోనే భారత్ చేసే సాయంలో టాప్ లిస్ట్‌లో మన పొరుగు దేశం అయిన భూటాన్ ఉంది. ఇక మాల్దీవులతో వివాదం కొనసాగుతున్నా.. ఆ దేశానికి ఈసారి అధిక కేటాయింపులు చేయడం విశేషం.


విదేశాల ఆర్థిక సాయం కోసం బడ్జెట్‌లో ఏ దేశానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే?


తొలిస్థానంలో భూటాన్


భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశం అయిన భూటాన్‌కు విదేశీ సాయంలో కేంద్రం అధిక నిధులను కేటాయించింది. 2025-2026 ఏడాదికి గానూ భూటాన్‌కు రూ. 2,150 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో వివరించారు. అయితే గతేడాది భూటాన్‌కు రూ. 2543 కోట్లు ఇవ్వగా.. ఈసారి కాస్త తగ్గింది. భూటాన్‌కు ఇచ్చే సాయం ఈసారి తగ్గినప్పటికీ.. భారత్-భూటాన్ అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతోంది. భూటాన్‌లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారానికి భారత్ నిధులు కేటాయిస్తోంది.


గతం కంటే మాల్దీవులకు సాయం పెంపు


మాల్దీవులు అధ్యక్షుడిగా చైనా అనుకూల వాది అయిన మహమ్మద్ ముయిజ్జూ ఎన్నికైన తర్వాత భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ.. మిత్ర దేశంగా ఉన్న భారత్‌తో కయ్యం పెట్టుకున్నారు. ఇక లక్షద్వీప్, మాల్దీవులు పర్యాటకంపై రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల నేపథ్యంలో భారత పర్యాటకులు మాల్దీవుల టూర్‌కు వెళ్లడం భారీగా తగ్గించడంతో మాల్దీవులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో మళ్లీ భారత సాయాన్ని మాల్దీవులు కోరింది. ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్‌లో మాల్దీవులకు భారత్ రూ. 600 కోట్లు ప్రకటించింది. అయితే గతేడాది రూ. 400 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు మరింత ఎక్కువ చేయడం గమనార్హం.


ఆఫ్గనిస్థాన్‌కు రెట్టింపు సాయం


తాలిబన్ల పాలనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్‌కు గతేడాది కంటే రెట్టింపు సాయం చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆఫ్గనిస్థాన్‌కు గతేడాది రూ.50 కోట్లు సాయం అందించగా.. తాజాగా దాన్ని రూ.100 కోట్లకు పెంచింది. అయితే రెండేళ్ల క్రితం ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన రాకముందు.. భారత్ నుంచి రూ. 207 కోట్ల సాయం అందగా ఆ తర్వాత తగ్గింది. ఇటీవలి కాలంలో ఆఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం.. భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది. తాలిబాన్ అధికారులతో.. భారత సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ మిస్రీ దుబాయ్‌లో భేటీ అయ్యారు. మరోవైపు ప్రస్తుతం పాకిస్తాన్‌కు, తాలిబన్లకు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో భారత్ చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తో్ంది. అయితే పాకిస్తాన్‌ను కాదని.. మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం పెరగాలంటే ఆఫ్గనిస్థాన్ చాలా కీలకం కావడంతో.. ఆ దేశానికి సాయాన్ని కేంద్రం వ్యూహాత్మకంగా పెంచినట్లు తెలుస్తోంది.


మయన్మార్‌కి తగ్గిన సాయం


సైనిక పాలనలో ఉన్న సరిహద్దు దేశం మయన్మార్‌కు ఈసారి భారత్ ఆర్థిక సాయాన్ని తగ్గించింది. గతేడాది సవరించిన కేటాయింపులతో రూ. 400 కోట్లు ఇవ్వగా.. తాజా బడ్జెట్‌లో దాన్ని రూ. 350 కోట్లకు తగ్గించింది.


గతంలో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా నేపాల్‌కు భారత్ ఇచ్చే కేటాయింపులను కొనసాగించింది. గతంలో లాగే రూ.700 కోట్లను నేపాల్‌కు భారత్ ప్రకటించింది.


మరోవైపు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని.. ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం నుంచి బయటపడుతున్న శ్రీలంకకు రూ.300 కోట్ల కేటాయింపులు చేసింది.


మరోవైపు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. భారత్‌పై తీవ్ర అక్కసు వెళ్లగక్కుతున్నప్పటికీ.. తాజా బడ్జెట్‌లో ఆ దేశానికి రూ. 120 కోట్లు కేటాయించింది.


ఇక.. ఆఫ్రికన్ దేశాలకు గతేడాది రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేంద్రం కేటాయించగా.. తాజాగా రూ.225 కోట్లకు పెంచింది.


టిన్ అమెరికా దేశానికి గత బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.30 కోట్లు తగ్గించి రూ.60 కోట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com