దేశంలో అతిపెద్ద ఆదియోగి (బస్ట్ కల్ప్చ్‌ర్) విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, తమిళనాట కోయంబత్తురు(112 అడుగుల ఎత్తు)లో ఉండగా ఇప్పుడు మూడో పెద్ద విగ్రహం ఆంధ్రాలో ముస్తాబవుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడి ఆంధ్రా శబరిమలగా పేరొందిన ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో పదినెలల వ్యవధిలో దీన్ని నిర్మించారు.
ఈనెల 26న శివరాత్రి రోజున ప్రారంభించేందుకు ఆలయ గురుస్వామి ఎస్‌ఎల్ కనకరాజు సారథ్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పూర్తిగా సిమెంట్ నిర్మించిన ఈ విగ్రహానికి రూ.30లక్షల వరకు ఖర్చయినట్లు గురుస్వామి తెలిపారు. విగ్రహం వెనుక భాగంలో యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన శిల్పి పెద్దరాఘవ, తన శిష్య బృందంతో కలిసి నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద శివుని విగ్రహమని ఆయన తెలిపారు.