గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్(కేఎల్‌ఈఎఫ్) ‘ఏ++’ రేటింగ్ కోసం న్యాక్ పరిశీలన బృందానికి భారీగా ముడుపులు ఇచ్చినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. న్యాక్ బృందంలోని అధికారులు, కేఎల్ ఆఫీసు బేరర్లు సహా మొత్తం 10 మందిని అరెస్టు చేసింది. తొలుత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ తర్వాత రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ‘న్యాక్’ బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు ముడుపులుగా ఇచ్చినట్లు గుర్తించింది.
ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్, భోపాల్, బిలా్‌సపూర్, గౌతం బుద్ధనగర్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు జరిపినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ సోదాల్లో 37 లక్షల నగదు, ఆరు ల్యాప్‌టా్‌పలు, ఒక ఐఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కేఎల్‌యూనివర్శిటీకి చెందిన జీపీ సారథి వర్మ, కోనేరు రాజా హరీన్, ఎ.రామకృష్ణ ఉన్నట్లు సమాచారం. అలాగే... న్యాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు పలువురు కమిటీ సభ్యులను కూడా సీబీఐ అరెస్టు చేసింది.