ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ తన నివాసం నుంచి ఆయన బయలుదేరనున్నారు. 2.55 గంటలకు చంద్రబాబు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు. 5.50 గంటలకు 1 జన్‌పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. కాగా ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఇటీవల ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో సీఎం తన ఢిల్లీ పర్యటనను ధ్రువీకరించారు. పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.