ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు జరుపుతూ అక్రమ వలసదారులను అరెస్టు చేసి వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇటీవల భారీ సంఖ్యలో అక్రమ వలసదారులను ట్రంప్ సర్కారు సైనిక విమానంలో పంపించిన విషయం తెలిసిందే. అయితే, చేతులకు బేడీలతో తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు.దీనిపై అమెరికాలో ప్రముఖ గాయని, నటి, నిర్మాత సెలెనా గోమెజ్ స్పందించారు. అధికారుల తీరు అమానుషంగా ఉందని, అక్రమ వలసదారులను అత్యంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించింది. కన్నీటితో ప్రశ్నిస్తున్న ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై వైట్ హౌస్ కూడా స్పందించింది. అక్రమ వలసదారులపట్ల గాయని సెలెనా స్పందన ఇదీ అంటూ సదరు వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.దీంతో వివాదం మరింత ముదిరింది. సెలెనా తీరుపై అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ అక్రమ వలసదారులు చేసిన అకృత్యాల గురించి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ వలసదారుల గురించి ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు సరే... వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి మా బిడ్డలపై అత్యాచారం చేసినప్పుడు, దారుణంగా హత్య చేసినప్పుడు కన్నీరు పెట్టలేదేమని నిలదీస్తున్నారు.బాలనటిగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సెలెనా గోమెజ్.. గాయనిగా, నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. సెలెనా అమెరికాలో పుట్టిపెరిగినా ఆమె పూర్వీకులు మెక్సికో నుంచి యూఎస్ఏకు వలస వచ్చారు. ఇటీవల ట్రంప్ సర్కారు అక్రమంగా అమెరికాలో ఉంటున్న మెక్సికన్ క్రిమినల్స్ ను అరెస్టు చేసి సైనిక విమానంలో వెనక్కి పంపించింది. దీనిపై సెలెనా స్పందిస్తూ... ‘‘నా వాళ్ల (మెక్సికన్ ప్రజల) పై దాడి జరుగుతోంది, పిల్లలు పెద్దలనే తేడా లేకుండా దాడులకు గురవుతున్నారు. వారికోసం ఏదైనా చేయాలని ఉంది కానీ ఏంచేయాలో అర్థం కావడంలేదు. కానీ నేను చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అంటూ సెలెనా కన్నీళ్లతో తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వీడియోను తొలగించారు.