మలేసియాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇవాళ జరుగుతున్న టైటిల్ పోరులో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. కౌలాలంపూర్ లోని బయుమాస్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ అంతిమ సమరంలో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా అమ్మాయిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు పరుగుల కోసం విలవిల్లాడారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. పరునిక సిసోడియా 2, ఆయుషి శుక్లా 2, వైష్ణవి శర్మ 2, షబ్నమ్ షకీల్ 1 వికెట్ తీశారు. అనంతరం, సులభసాధ్యమైన లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ త్రిష 40, వన్ డౌన్ బ్యాటర్ సనికా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి మరో 12 పరుగులు కావాలి.