పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో తాళి కట్టిన భర్త ప్రాణాలనే ఫణంగా పెట్టిన ఓ భార్య.. అతడి కిడ్నీని విక్రయించి.. వచ్చిన డబ్బుతో లవర్‌తో వెళ్లిపోయింది. భర్తను బలవంతపెట్టి కిడ్నీని అమ్మేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఆ భార్య.. వచ్చిన డబ్బుతో తన కుమార్తెను మంచి చదువులు చదివించుకుందామని చెప్పింది. అయితే తన భార్య చెప్పిన విషయాలన్నీ గుడ్డిగా నమ్మిన ఆ అమాయక భర్త.. కిడ్నీని ఇచ్చేశాడు. ఆ కిడ్నీ అమ్మగా.. రూ.10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకువచ్చిన తర్వాత రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ రూ.10 లక్షలు తీసుకుని.. ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే అసలు విషయం బయటపడిన తర్వాత ఆ భర్త.. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి 10 ఏళ్ల కుమార్తె ఉంది. ఇక భార్య, ఆమె లవర్ ఆచూకీ తెలిసి అక్కడికి వెళ్లగా.. వారి ముందే గడియపెట్టేసుకుని వెళ్లగొట్టింది.
హౌరా జిల్లాలోని సంక్రైల్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బాధితుడికి 10 ఏళ్ల కుమార్తె ఉండగా.. అతడు సంపాదించే ఆదాయం ఆమె చదువుకు అయ్యే ఖర్చులకు సరిపోలేదు. దీంతో అతడి కిడ్నీ అమ్మేస్తే.. కుమార్తె చదువుతోపాటు కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని భార్య నమ్మించింది. కుమార్తె భవిష్యత్ నాశనం అయితే అందుకు బాధ్యత అతడిదే అని ఆ భార్య నిత్యం ఘర్షణ పడుతూనే ఉండేది. అయితే ఆమె అంత ఒత్తిడి ఎందుకు చేస్తుందో ఆ భర్త కనిపెట్టలేకపోయాడు. చివరికి తన కూతురి భవిష్యత్తును ఆలోచించి కిడ్నీ అమ్మేసేందుకు అంగీకరించాడు. దీంతో నెలరోజుల పాటు కిడ్నీని అమ్మేందుకు భార్యాభర్తలు వెతికారు.
చివరికి ఆ భర్త కిడ్నీ.. రూ. 10 లక్షలకు అమ్ముడుపోయింది. ఇద్దరూ కలిసి కిడ్నీ కొనే వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బు తీసుకుని వచ్చారు. ఆ డబ్బును తన వద్దే పెట్టుకున్న భార్య.. ఉదయాన్నే బ్యాంకులో డిపాజిట్ చేద్దామని నమ్మించింది. కానీ అదేరోజు రాత్రి.. ఇంటి నుంచి ఆమె పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత శుక్రవారం తన భార్య బరాక్‌పూర్‌లోని సుభాష్ కాలనీలో రవిదాస్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు భర్తకు తెలిసింది. ఈ క్రమంలోనే తన కుమార్తెతో కలిసి అక్కడికి చేరుకున్న భర్తను చూసిన ఆ భార్య షాక్ అయింది. వారిని చూసి ఇంట్లోకి వెళ్లి తలుపు గడియపెట్టుకుంది. డబ్బులు ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించింది. అంతేకాకుండా విడాకులు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. కనీసం తన 10 ఏళ్ల కుమార్తెను చూసి కూడా ఆమెపై జాలి చూపించలేకపోయింది. దీంతో తన భార్య, ఆమెతో కలిసి ఉంటున్న పెయింటర్ రవిదాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశాడు.