అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో దేశీయ సూచీలు సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ వారంలో 5,6 తేదీలలో ఆర్బీఐ ద్రవ్యపరపతి మీటింగ్ జరగనుంది.కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఆదాయపు పన్ను తగ్గింపు కారణంగా ఏఫ్‌ఎమ్‌సీజీ, బడ్జెట్ కేటాయింపుల వల్ల వ్యవసాయ ఆధారిత స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.శనివారం ముగింపు (77, 505)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 500 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 750 పాయింట్లు కోల్పోయి 76, 756 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 672 పాయింట్లు కోల్పోయి 76, 833 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 239 పాయింట్ల నష్టంతో 23, 243 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లో పీఐ ఇండస్ట్రీస్, నైకా, యూపీఎల్, టీవీఎస్ మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హుడ్కో, మదర్సన్, సైమన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 725 పాయింట్ల నష్టాంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 479 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ప్రస్తుతానికి 87.16గా ఉంది.