నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. 41 ఓట్లతో సయ్యద్ తహసిన్ గెలుపొందారు. తహసిన్‌ను డిప్యూటీ మేయర్‌గా జేసీ కార్తీక్ ప్రకటించారు. టీడీపీ 41 ఓట్లు పోలవగా, వైసీపీ 21 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు బుచ్చి మున్సిపాలిటీలోని రెండు వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా సయ్యద్ తహసిన్ ఎన్నికవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. సోమవారం మాట్లాడుతూ.. టీడీపీ మద్ధతుతో ముస్లిం మైనార్టీ మహిళా కార్పోరేటర్ సయ్యద్ తహసిన్ భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థినికి అవకాశం ఇచ్చారని.. తాను బలపరచినట్లు తెలిపారు. తాహసీన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు తనతోపాటు, 40 మంది కార్పోరేటర్లు సహకరించి భారీ మెజార్టీ ఇచ్చామన్నారు. ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఆలోచనలని టీడీపీ అధిష్టానం ఆమోదించిందన్నారు. నెల్లూరు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బహుమానం ఇచ్చామన్నారు. రాబోయే ఎన్నికల్లో 54 డివిజన్లను కూటమి గెలుచుకోవడం ఖాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు లేకుండా చేసిందని... అందుకే వైసీపీ మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతోందని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.