వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి కిర్లంపూడిలోని నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం సృష్టించాడు. ఆదివారం ఉదయం గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి.. ట్రాక్టర్‌తో వచ్చి భయాందోళనకు గురిచేశాడు. అయితే ఈ దాడిపై టీడీపీ ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై ఆకతాయి దాడిని వైసీపీ రాజకీయం చేయడం నీచమని ఎంపీ సానా సతీష్ విమర్శించారు. ఏవో వ్యక్తిగత లావాదేవీ గొడవలతో దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆకతాయి చేసిన దాడిని ముద్రగడపై దాడిలా వైసీపీ రాజకీయం చేస్తోందని.. ఈ డ్రామాపై జనం నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు. లేనిదానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడకు ఫోన్ చేయడం చూస్తుంటే అంతా వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా అర్థమవుతోందని చెప్పారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీని ఈ డ్రామాలతో ఇంకా పాతాళంలోకి పడి పోతుందని విమర్శలు చేశారు. గత పాలనలో వైసీపీ పాపాలు రోజుకొకటి బయటపడుతుండటంతో ఈ చిల్లర ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీ సానా సతీష్ విమర్శించారు.