ఒకరిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న నలుగురిని అరెస్టు చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. తన కుమార్తెకు ప్రేమ వివాహం చేశాడని యువకుడిపై కోపం పెంచుకున్న ఓ తండ్రి.. అతన్ని హత్య చేసేందుకు పథకం రచించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు మనుషులను రంగంలోకి దింపాడు. వారి ప్రయత్నాలను ముందుగానే కనిపెట్టిన నందిగామ పోలీసులు హత్య కుట్రను భగ్నం చేశారు. అత్యంత చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఆమె 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని నరసింహారావు రగిపోయాడు. కనీ పెంచిన తమను వదిలేసి వెళ్లిపోయిందని, గ్రామంలో సూటిపోటి మాటలు అంటున్నారని ఆగ్రహానికి గురయ్యాడు. దీని మెుత్తానికి మువ్వా గోపి అనే యువకుడే కారణమని తెలుసుకున్నాడు. తన కుమార్తెను ప్రేమికుడు వద్దకు చేర్చి పెళ్లి విషయంలో వారికి సహకరించాడని, అందువల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని భావించాడు. మువ్వా గోపిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గతేడాది చివరిలో హైదరాబాద్ కొత్తపేటకు వెళ్లాడు. అక్కడి నివాసం ఉంటున్న పాలంపల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తిని కలిసి రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. తాను చెప్పిన వ్యక్తిని హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నాడు.విజయ్ కుమార్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి సంక్రాంతి పండగ సమయంలో ఐతవరం గ్రామానికి వచ్చాడు. నరసింహారావుతో కలిసి మూడ్రోజులపాటు గోపి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. అప్పుడు కుదరకపోవడంతో నిందితులు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే తాజాగా వారు మళ్లీ ఆదివారం నాడు నందిగామకు వచ్చారు. అయితే పట్టణంలో వీరంతా అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. నలుగురి నిందితుల నుంచి నాలుగు కోడి కత్తులు, రూ.2వేలు నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తిలక్ చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తిలక్ వెల్లడించారు.