మరో రెండు రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. నేడే ప్రచార కార్యక్రమాలు ముగిసిపోతుండడంతో.. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్లు సభలు, ర్యాలీలు నిర్వహించుకుంటూ ఇతర పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ ఆఫర్లకు లొంగిన ప్రధాన ఎన్నికల కమిషనర్.. దేశ ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నేటితో ప్రచార కార్యక్రమాలు ముగిసిపోతుండగా.. చివరి రోజు అన్ని పార్టీల నేతలు ప్రచారాలతో ఢిల్లీని హోరెత్తిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సైతం.. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కేవలం బీజేపీపైనే కాకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై కూడా ఘాటు విమర్శలు చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందు ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ ఉనికి పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తుందంటూ కేజ్రీవాల్ అన్నారు. ఈ నెలాఖరుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ పొందబోతున్నారని.. ఆయనకు బీజేపీ ఏదో ఆఫర్ ఇచ్చే ఉంటుందంటూ వివరించారు. రాష్ట్రపతి పదవినో, గవర్నర్ పదవినో కట్టబెడతానని చెప్పడం వల్లే ఆయన పదవులపై ఆశతో దేశ ప్రజస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇప్పటికైనా సీఈసీ రాజీవ్ కుమార్ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టి.. ఎన్నికలను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోరుతున్నానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. మరో రెండు రోజుల్లోనే ఎన్నికలు ఉండనుండగా.. బీజేపీ గూండాలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు చేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత జరగుతున్నా ఢిల్లీ పోలీసులు సైతం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ఓవైపు ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం తాము అనేక పథకాలు తీసుకు వస్తుంటే.. బీజేపీ మాత్రం గొడవలు సృష్టించేందుకు గూండాలను పంపుతోందని ఆరోపించారు. అలాగే ఓటింగ్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు తమ నేతలకు స్పై కెమెరాలు ఇస్తున్నామని కూడా కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. ఎవరి వల్ల ఢిల్లీకి మంచి జరుగుతుందో బేరీజు వేసుకుని మరీ ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa