రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి రాష్ట్ర పండుగగా రధసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసామన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తున్నారని, ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారని.. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయన్నారు.