దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెండో కతోలిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదలమాత పుణ్యక్షేత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని శ్రీకాకుళం మేత్రాసనం ఫాదర్ చల్లా డేవిడ్ అన్నారు. లూర్ధుమాత మహోత్సవాల నవదిన ప్రార్థనల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన 5వ రోజు నవదిన ప్రార్థనలకు ముఖ్య అతిథిగా ఫాదర్ చల్లా డేవిడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సందేశమిస్తూ మరియమాత భక్తుల చేత మహిమల మాతగా గౌరవించబడుతుందని తెలిపారు. పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారని తెలిపారు. గురువులు ఫాదర్ చెల్లా డేవిడ్, మోన్సిగ్ఞోర్ మువ్వల ప్రసాద్, రెక్టర్ జయరాజు, కొలకాని మరియప్ప, తోట సునీల్ రాజు తదితరులు సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం నిరుపేదలు, అనాధలు, శరణార్ధుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.