గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ లాక్కుంటోందని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కుట్రలతో విజయం సాధించారని విమర్శించారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
గుంటూరులో 57 డివిజన్లలో వైయస్ఆర్‌సీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. 'మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కార్పోరేషన్ లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటాని సిద్దంగా ఉన్నామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.