ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం భేటీ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూముల వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పంచగ్రామాలపైనా మంత్రిమండలి చర్చించనున్నట్లు తెలిసింది. స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన 15 ప్రాజెక్టులకు సైతం ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం హామీపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తయారు చేసిందని.. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
వీటితో పాటుగా ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలపైనా సీఎం చంద్రబాబు.. మంత్రులతో చర్చించనున్నారు. కేబినెట్ భేటీ పూర్తైన తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చిస్తారు. ఈ సందర్భంగానే బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే ఏపీ ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది. అయితే ఈ కేబినెట్ భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం దూరం కానున్నట్లు తెలిసింది. గురువారం జరిగే మంత్రిమండలి సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవచ్చునని సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ జ్వరంతోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని వెల్లడించాయి. అనారోగ్యం కారణంగా గురువారం జరిగే ఏపీ కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి లడ్డూ వ్యవహారం సమయంలో తిరుమలకు జ్వరంతోనే వెళ్లారు పవన్ కళ్యాణ్.