ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోచ్చని అధికారులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.పవన్ కళ్యాణ్ బాధపడుతున్న స్పాండిలైటిస్ వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్పాండిలైటిస్ అంటే ఏమిటి?
జీవనవిధానంలో మార్పుల వల్ల స్పాండిలైటిస్ సమస్య వస్తుంది. మెడలో వెన్నెముక భాగంలో డిస్కుల మధ్య నరాలు ఉంటాయి. ఈ నరాల మధ్య ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల, నరాలు ఒత్తుకోవటం వల్ల మెడనొప్పి, నడుం నొప్పి వస్తుంటుంది. తీవ్రమైన మెడనొప్పితో పాటు తల తిరగడం, తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది. అంతేకాకుండా వాంతులు రావడం, వికారంగా అనిపించడం, మానసికంగా దిగులుగా ఉంటుంది.ఈ వ్యాధి ఎక్కువ ముదిరితే చేతికి సంబంధించిన కండరాలు కృశించి పోయే అవకాశం ఉంది. దీనివల్ల రక్తసరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. చేతుల్లో స్పర్శ తగ్గడం, ఆందోళన పడటం, బలహీనంగా ఉండటం, తరచూ తలనొప్పితో బాధపడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా జీవన్మరణ సమస్యగా కూడా మారవచ్చు.