మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో వైఎస్ జగన్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జగన్ 2.0 చూస్తారని.. జగన్ 2.0 వేరేగా ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాననేదీ జగన్ 2.0లో చూస్తారని.. ఈసారి ఎవరూ వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు.
తొలివిడతలో ప్రజల కోసం పనిచేశానన్న వైఎస్ జగన్.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో జగన్ 2.0లో చూపిస్తానని అన్నారు. జనానికి మంచి చేయాలనే తాపత్రయంలో తొలి విడతలో వైసీపీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని.. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు పెడుతున్న కష్టాలు, బాధలు చూశాక, ఈ సారి వేరే రకంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలను అక్రమంగా వేధించిన వారిని ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతానన్న జగన్.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, అక్రమ కేసులు పెడతారన్న జగన్.. జైల్లో పెట్టినా భయపడవద్దని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ కార్యకర్తలకు తాను అండగా నిలుస్తానని అన్నారు. వచ్చేసారి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న వైఎస్ జగన్ .. ఈసారి 30 ఏళ్లు పరిపాలన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్రలేపటమేనని ఎన్నికలకు ముందే చెప్పానన్న వైఎస్ జగన్.. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు ఉండాలన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయంటూ వార్తలు వస్తున్నాయని.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయన్న జగన్.. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడే లీడర్ అవుతామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథను గుర్తుకు తెచ్చుకోవాలన్న జగన్.. తన మీద టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమ కేసులు పెట్టాయన్నారు. రాజకీయంగా ఎదుగుతున్నాననే కారణంతో అక్రమ కేసులు పెట్టి.. 16 నెలలు జైల్లో పెట్టారని ఆరోపించారు. కానీ.. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యానంటూ జగన్ గుర్తుచేశారు.
మంచి చేసిన వారిని, అలాగే చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలన్న జగన్.. వైసీపీ బతుకుతుందని, రాష్ట్రాన్ని ఏలుతుందన్నారు. మరో 30 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుందనీ.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని.. ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు.