ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ కాదు అభినందనే నా హీరో.. అందుకే ఈ మీసం..

international |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 07:43 PM

సినిమాల్లోని హీరోలకే ఫ్యాన్స్ వుంటారు. వాళ్లు సినిమాలో ఏది చేస్తే అది ట్రెండ్ అవుతుంది. చాలా మంది యువత ఆ హీరో తొడిగిన టీషర్ట్, అతని క్రాఫ్ స్టైల్, అతని ఊత పదం ఇలా చాలావాటిని పొలోమని ఫాలో అవుతుంటారు. అది పాత మాట. ఇప్పుడు రీల్ హీరోల కన్నా రియల్ హీరోలకే ఫ్యాన్స్ ఎక్కువ అని నిరూపిస్తోంది వింగ్ కమాండర్ అభినందన్ విషయం. ఆయన పాక్ చెరలో వున్నప్పుడు దేశం యావత్తు అతని గురించి కలత చెందింది. ప్రార్థనలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శుక్రవారం రాత్రి పాక్ అభినందన్‌ను భారత్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే అభినందన్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన అభిమానులందరూ మెలేసిన మీసాన్ని పెంచుతున్నారు.
తాజాగా బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ చాంద్‌ అనే వ్యక్తి.. అభినందన్‌ మీసం కట్టు మాదిరి తను కూడా మీసాలు కట్ చేయించుకున్నాడు. ఇప్పుడు అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘abhinandan moustache style’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. దీని గురించి మహమ్మద్‌ మాట్లాడుతూ.. ‘నేను అభినందన్‌ సర్‌కు వీరాభిమానిని. ఆయన మీసం స్టైల్‌ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా నేనుకూడా ఆ మీసం స్టైల్‌ను అనుసరిస్తున్నాను. అభినందన్‌ సర్‌ రియల్‌ హీరో. ఆయనలాగే మీసకట్టు చేయించుకొన్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఒకప్పుడు నేను సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ని. కానీ ఇప్పుడు నా ఫేవరెట్‌ హీరో అభినందనే’ అని పేర్కొన్నాడు మహమ్మద్ చాంద్.
ఆయన మీసం స్టైల్‌ను కొందరు చిత్రాలు గీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు అమ్మాయిలు అభినందన్ మీసం అంటూ మూతి మీద రంగులతో మీసం దిద్దుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ చాంద్ కూడా తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. అభినందన్‌ మీసం స్టైల్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. తమకూ ఇలాంటి స్టైలే కావాలంటూ ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. పంజాబ్, బెంగుళూరు ప్రదేశాల్లో కొన్ని సెలూన్ల యజమానులు అభినందన్ హెయిర్ కట్, మీసం కట్టుకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. అలా ఎందుకంటే తమకు అభినందన్ అంటే చాలా అభిమానం అని సమాధానం ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa