ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇప్పుడు తన పేరు మార్పుని ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ ఇప్పుడు జొమాటో నుంచి "ఎటర్నల్ లిమిటెడ్"గా మారిందిఈ నిర్ణయాన్ని జొమాటో బోర్డు ఆమోదించింది. ఈ విషయంలో CEO దీపిందర్ గోయల్ తన వాటాదారులకు లేఖ రాస్తూ, కొత్త లోగోను ఆవిష్కరించారు.
జొమాటో నాలుగు ప్రధాన వ్యాపార విభాగాలు ఇప్పుడు కొత్త పేరుతో అవతరించనున్నాయి. వాటిలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, క్విక్-కామర్స్ విభాగం బ్లింకిట్, లైవ్ ఈవెంట్స్ వెంచర్ డిస్ట్రిక్ట్, కిచెన్ సప్లైస్ యూనిట్ హైపర్ ప్యూర్ ఉన్నాయి. కంపెనీ బోర్డు 2024 డిసెంబర్ 23న ఈ పేరు మార్పును అధికారికంగా ప్రకటించింది. ఈ తేదీకి కొంతకాలం ముందు జొమాటో BSE సెన్సెక్స్‌లో చేరింది.CEO గోయల్ తన లేఖలో వివరించిన ప్రకారం జొమాటో సంస్థను "ఎటర్నల్"గా పిలవడం మొదలుపెట్టింది. జొమాటోను కొనుగోలు చేసిన తర్వాత ఈ సంస్థను అంతర్గతంగా "ఎటర్నల్" అని పిలవడం ప్రారంభించారు. "ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం, ఒక కొత్త ప్రయాణం ప్రారంభించడమే" అని గోయల్ పేర్కొన్నారు. జొమాటో CEO గోయల్ లేఖలో, సంస్థ శాశ్వతమైన విధానంలో వ్యవహరించాలనే లక్ష్యంతో "ఎటర్నల్" అనే పేరు పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.
"జొమాటో ఒక సాధారణ సేవా కోరిక నుంచి పుట్టింది. అయితే ఇది కాలక్రమంలో ఒక వ్యాపారంగా మారింది. ఈ ప్రయాణం నిజంగా ప్రత్యేకమైనదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే బ్లింకిట్ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుంచి జొమాటో సంస్థ "ఎటర్నల్" పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇది బ్రాండ్, యాప్, సంస్థ మధ్య తేడాను గుర్తించడం కోసం అవసరం అయ్యిందన్నారు. కానీ జోమాటో యాప్, బ్రాండ్ పేరులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన అన్నారు. ఈ పేరుతోపాటు తమ ప్రస్తుత వ్యాపార విభాగాలను, సంస్థ విలువలను, భవిష్యత్తు దిశను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
వెబ్ సైట్ కూడా..
ఈ పేరు మార్పుతో పాటు సంస్థ వారి కార్పొరేట్ వెబ్‌సైట్‌ను కూడా మారుస్తోంది. ప్రస్తుతం ఉన్న zomato.comను eternal.comకు మార్చనున్నామని గోయల్ తెలిపారు. అటుపై జొమాటో స్టాక్ టిక్కర్ కూడా ZOMATO నుంచి ETERNALకి మారనుంది. కంపెనీ తన అన్ని రికార్డులను, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, స్టాక్ మార్కెట్ సూచీలకు కొత్త పేరుతో అనుకూలంగా మార్చాలని నిర్ణయించింది.