ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల కడుపు కొడుతున్నారని ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోసంతో వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సంపద సృష్టించటం అంటే ఉద్యోగుల నోళ్లు కొట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... సంపూర్ణ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా అతి స్వల్ప కాలంలో 1.35 లక్షల మందిని సచివాలయాల ఉద్యోగాల్లో నియమించారని ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
15,004 సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలన్నీ సులువుగా, వేగంగా అందేలా చేశారన్న ఆయన, ఈ వ్యవస్థను అనేక రాష్ట్రాలు పరిశీలించాయని గుర్తు చేశారు. ఆ అక్కసుతోనే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఆక్షేపించారు. సేవలు కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, 2.60 లక్షల మంది వాలంటీర్లను నమ్మించి మోసం చేసినట్లుగా, సచివాలయాల ఉద్యోగులపైనా అదే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయాల్లో ప్రస్తుతం 1,27,175 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, అంత మంది అవసరం లేదంటూ.. 15,496 మంది ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విధంగా గత జనవరి 25న, జీఓ నెం.1 జారీ చేశారని ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఆ విధంగా రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల సిబ్బందిని దాదాపు 1.12 లక్షలకు కుదిస్తున్నారని, దీని వల్ల తమపై పనిభారం పెరుగుతుందని సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. నిజానికి ఇప్పటికే సచివాలయాల్లో దాదాపు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఉద్యోగుల జాబ్‌ఛార్ట్ కూడా మార్చేసి గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారన్న ఆయన, ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్‌ఛార్టులు మార్చడం ఏమిటని సచివాలయాల ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి గుర్తు చేశారు. వెంటనే ఆ హామీలన్నీ నెరవేర్చాలని, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, ఆ హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదని, కనీసం 12వ పీఆర్సీని అపాయింట్ చేస్తారో? లేదో? కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా ఉద్యోగులకు వివి«ధ రూపాల్లో ప్రభుత్వం రూ.30 వేల కోట్లు బకాయి పడిందని తెలిపారు. సంక్రాంతికి ఇస్తామన్న రూ.1000 కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదని, పెన్షన్ విధానంపై స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇంకా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్న ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆలూరులో ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నరికి చంపారని, యాడికి మండలంలో ధనుంజయ అనే మరో ఫీల్డ్ అసిస్టెంట్‌ను 40 మంది టీడీపీ కార్యకర్తలు నిర్బంధించి బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు.
![]() |
![]() |