ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో బీజేపీ విజయానికి కారణాలు ఇవే.. పక్కాగా ప్లాన్ చేసిన కమలనాథులు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 08:31 PM

2014 నుంచి వరుసగా మూడుసార్లు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇటీవలె వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ సొంతగా, మిత్రపక్షాలతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్రాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటోంది. అయితే 3 సార్లు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆ పార్టీకి అధికారం దక్కలేదు. కానీ తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన కమలం పార్టీ.. ఈసారి విజయం దక్కించుకుంది. దీనికోసం ఓవైపు ఢిల్లీలో సోషల్ ఇంజినీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ధీటుగా మరిన్ని హామీలను బీజేపీ ప్రకటించింది.


మరోవైపు.. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిక రావడం.. ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఢిల్లీలో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినా.. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ససేమిరా అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి 7 శాతానికి పైగా ఓట్ షేర్‌ను దక్కించుకుంది. 2015, 2020, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన హస్తం పార్టీ.. ఈ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో బీజేపీ విజయం సులువైంది. బీజేపీకి 48 శాతం ఓటు శాతం రాగా.. కాంగ్రెస్, ఆప్ కలిస్తే 50 శాతానికి పైగా ఓటు శాతం వచ్చింది. దీంతో ఆప్, కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేది అనే వాదనలు వినిపిస్తున్నాయి.


ఇక ఢిల్లీలో క్షేత్రస్థాయిలోనూ బీజేపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. ప్రతి బూత్‌లో కనీసం 50 శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. ఒక్కో నియోజకవర్గంలో గతంలో సాధించిన ఓట్ల కంటే 20 వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా బూత్‌ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన కమలం పార్టీ.. తమకు అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వచ్చింది. తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు.. వారితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీకి సువర్ణ అవకాశం దక్కింది.


మరోవైపు.. కరోనా మహమ్మారి సమయంలో ఢిల్లీలో ఉండే ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు.. ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఓటర్ల జాబితా ఆధారంగా వారందరికీ ఫోన్లు చేసి వచ్చి ఓటు వేసేందుకు కమలం పార్టీ కార్యకర్తలు పిలిపించారు. ఉత్తర్‌ప్రప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో నివసించిన వారిపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకంగా మారింది. తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రచారం చేయించింది.


ఇక బూత్, నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి.. వాటిని గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు.. బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించింది. కేంద్రమంత్రులు ఒక్కొక్కరికీ 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించింది. ఆ నియోజకవర్గాల్లో ప్రతి నిర్ణయానికీ వారే బాధ్యులని స్పష్టం చేసింది. మరోవైపు.. క్షేత్ర స్థాయిలో పని చేసే నేతలు నిత్యం హైకమాండ్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి దృష్టి సారించింది. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని.. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇందులో బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా సహాయం చేసింది.


మరోవైపు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. బీజేపీ భారీగా సంక్షేమ పథకాల హామీలు గుప్పించింది. ఢిల్లీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు 3 విడతల్లో మేనిఫెస్టోను ప్రకటించింది. పేదలకు రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్‌.. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం.. సీనియర్ సిటిజన్లకు రూ.2,500 పెన్షన్.. వితంతువులు, నిరుపేద మహిళల రూ.2,500 పెన్షన్.. అటల్ క్యాంటీన్లతో రూ.5లకే భోజనం.. ఆటో-టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా.. గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా.. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఢిల్లీ ఓటర్లను బీజేపీ ఆకట్టుకుంది. మరోవైపు.. కలుషితం అయిన యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలను కమలం పార్టీ ఇచ్చింది. ఈ సంక్షేమ పథకాలు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు.


మరోవైపు.. ఇటీవల ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిని భారీగా పెంచడం కూడా బీజేపీకి బాగా కలిసివచ్చింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో ఏకంగా 40 లక్షల మంది ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వారు ఉన్నారని అంచనా. ఇవే కాకుండా ఢిల్లీలో 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆప్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ విజయానికి కారణం అయింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, శీష్‌మహల్‌ వివాదం, ఆప్‌పై అవినీతి ఆరోపణలు, యమునా నది వివాదం.. ఆప్‌కు ప్రజల్లో ఉన్న క్లీన్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com