దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆప్ కేవలం 22 సీట్లనే గెలుచుకుంది. అందులోనూ కీలక నేతలు అంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు ఓడిపోయారు. అగ్ర నేతల్లో సీఎం అతిశీ ఒక్కరే గెలుపొందారు. అయితే ఎన్నికల్లో గెలిచినా.. తాను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో లేనని చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. అలాగే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా సైతం జంగ్‌పురా స్థానం నుంచి ఓడిపోయారు. అలాగే ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ షాకూరి బస్తీలో ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానంలో పరాజయం పాలయ్యారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి సురేందర్ భరద్వాజ్ ఓడిపోయారు.
అయితే అగ్ర నేతల్లో ఒకే ఒక్కరు.. ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ విజయం సాధించారు. చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్న ఆమె ఆకరుకు అనూహ్యంగా గెలుపొందారు. అయితే ఢిల్లీలో మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48 స్థానాలను దక్కించుకుంది. అలాగే ఆప్ కేవలం 22 స్థానాలను గెలుచుకుంది. ఇలా అతి తక్కువ స్థానాలను గెలుచుకోవడం అందులోనూ అగ్ర నేతలు ఓడిపోవడంతో.. సీఎం అతిశీ తాను ఎన్నికల్లో గెలుపొందినా దాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఆమే నేరుగా వెల్లడించారు.
ముఖ్యంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను గెలిచినట్లు వెల్లడించారు. అయితే సెలబ్రేట్ చేసుకునే సమయం కాదని.. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.