ఫాసిజం దేశంలో నలుమూలలా విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండ్రోజులు కొనసాగిన విప్లవ రచయిత సంఘం (విరసం) 24వ సాహిత్య పాఠశాల కార్యక్రమాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన ముగింపు బహిరంగ సభలో ముఖ్యవక్తగా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగించారు. రచయితల దృక్పథంలో మార్పు రావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. ఇటీవల కాలంలో రచయితలు ప్రజలకు దగ్గరయ్యే సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని, ఇది ఆశాజనకంగా భావిస్తున్నానని చెప్పారు. విరసం నాయకుడు నాగేశ్వరాచారి అధ్యక్షత వహించిన ఈ సభకు ముందు విరసం నాయకులు 27 పుస్తకాలు ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి రివేరా, సాయిబాబా సహచరి వసంతకుమారి, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్, విరసం నేతలు పాణి, ఎన్.రవి, వరలక్ష్మి, సాగర్, శశికళ తదితరులు పాల్గొన్నారు.