మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజనను అప్పటి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నారు. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం.. ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మహారాష్ట్రలో మొత్తంగా ఈ పథకం కింద 2.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన కింద ప్రతీ నెల రూ.3700 కోట్లను సర్కార్ ఖర్చు చేస్తోంది. అయితే తాజాగా 5 లక్షల మంది మహిళలు అర్హత లేకున్నా.. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నారని గుర్తించి.. వారిని తొలగించింది.
ఈ పథకం కింద లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షించిన మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది మహిళలను అందులో నుంచి తొలగించినట్లు ఆ రాష్ట్ర మహిళ, శిశు సంక్షమ శాఖ మంత్రి అదితి తట్కారే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ పథకానికి అనర్హులుగా ఉన్న మహిళలను తొలగించినట్లు చెప్పారు. తొలగించిన 5 లక్షల మంది మహిళలల్లో 2.3 లక్షల మంది మహిళలు ఇప్పటికే సంజయ్ గాంధీ నిరాధార్ యోజన కింద లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. 65 ఏళ్లు పైబడిన వారు 1.1 లక్షల మంది మహిళలు ఉన్నారని తేల్చారు. ఇక ఇంకో 1.6 లక్షల మంది మహిళలకు కార్లు ఉన్నాయని.. నమో శక్తి యోజన కింద లబ్ధి పొందుతున్నవారు, కొందరు స్వచ్ఛందంగా ఈ పథకం నుంచి బయటికి వెళ్లాలి అనుకునేవారు ఉన్నారని పేర్కొన్నారు.
ఇటీవల జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ మహారాష్ట్ర లడ్కీ బహీన్ యోజన కింద దాదాపు 20 లక్షల మంది అనర్హులైన మహిళలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నారని అంచనా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి అనర్హులను పథకం నుంచి తొలగిస్తే మహారాష్ట్ర ఖజానాకు నెలకు రూ.300 కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు. 20 లక్షల మంది అనర్హులను తొలగిస్తే.. ఏటా రూ.3600 కోట్లు ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ లడ్కీ బహీన్ యోజన పథకం కింద అప్పటివరకు అందించిన రూ.1500 కాస్తా.. పెంచి రూ.2100 అందిస్తామని.. మహాయుతి కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆమోదం కల్పిస్తుందా లేక ఈ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను సవరించడాన్ని కొనసాగిస్తుందా అనేది వెల్లడించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అదితి తట్కారే స్పష్టం చేశారు.
![]() |
![]() |