అల్లూరి జిల్లా ఏజెన్సీలో 48 గంటల పాటు బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే రోడ్డుపైకి వైసీపీ, వామపక్షాల నాయకులు ఆందోళనకారులు వచ్చి షాపులను మూసివేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న బంద్‌తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో షాపులు, మీసేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ ప్రభావంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1/70 యాక్ట్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గిరిజన సంఘాలు, వామపక్షాలు బంద్ చేపట్టాయి. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న 1/70 చట్టానికి సవరణలు చేయాలని అయ్యన్నపాత్రుడు ఓ నాలుగు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే.
అయితే అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా 48 గంటల పాటు గిరిజనులు మన్యం ప్రాంతాల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం కోసం అన్ని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని వామపక్షాల నేతలు కోరారు. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |