వివాహేతర సంబంధం నేపథ్యంతోనే మహిళ తన భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతపురం నగర శివారులోని చింతతోపులో ఈనెల రెండో తేదీన జరిగిన హత్య కేసును అనంతపురం రూరల్ పోలీసులు ఛేదించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన దేవరకొండ కాశప్ప హత్య కేసులో అతడి భార్య దేవరకొండ సౌభాగ్య, కర్ణాటక రాష్ట్రం కోలార్ సమీపంలోని బంగారుపేట్‌కు చెందిన నవాజ్‌బేగ్, కోలార్ పట్టణానికి చెందిన గౌస్‌పీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రూరల్ పోలీ్‌సస్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ రాంబాబుతో కలిసి సీఐ శేఖర్ అరెస్ట్ వివరాలు వెల్లడించారు.దేవరకొండ కాశప్ప అలియాస్ కాశి, అతడి భార్య సౌభాగ్య కక్కలపల్లి టమోటా మండీలో కూలీలతో మేస్ర్తీ పని చేయించి తిరిగి గ్రామానికి వెళ్లేవారు.
కాశప్ప మూడు నెలల కిందట తన పొలం అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని చీరల వ్యాపారం చేయడానికి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉండి పోయాడు. అతడి భార్య సౌభాగ్య మాత్రం రోజూ వచ్చి పనులు చేయించి వెళ్లేది. ఈ క్రమంలో రెండు నెలల కిందట కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన నవాజ్‌బేగ్, గౌస్‌పీర్‌లు సౌభాగ్య దగ్గర పనికి చేరారు. ఈ క్రమంలో సౌభాగ్య, నవాజ్‌బేగ్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి వ్యవహారం టమోటా మండీ మొత్తం తెలిసిపోయింది. ఈ విషయం కాశప్పకు కూడా తెలియడంతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ చంపుతానని హెచ్చరిం చాడు. దీంతో తమ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని సౌభాగ్య భావించింది. నవాజ్‌తో చర్చించి, గౌస్‌తో కలిసి భర్తను హత్య చేయాలని కోరింది. ఈనెల 1వతేదీ స్థానిక కియ మోటార్స్ ఎదురుగా ఉన్న చింతతోపులోకి కాశప్పను నవాజ్, గౌస్ నమ్మించి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. ఆమత్తులో ఉండగానే ఖాళీ బీరు బాటిల్, బండరాయితో మోది హత్య చేశారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు సౌభాగ్య స్థానిక పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఈనెల మూడో తేదీ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్ డీఎస్పీ వెంకటేశులు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు ఛేదించారు. సీఐ శేఖర్‌కు సమాచారం అందడంతో స్థానిక ఆర్డీటీ స్టేడియం సమీపంలో ఎస్‌ఐ రాంబాబు, సిబ్బందితో కలిసి ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు.
![]() |
![]() |