విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఎగ్జిబిషన్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిబిషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నా, ప్రదర్శనకు ప్రజల్ని అనుమతించే సమయంలో జరిగితే ఏమి జరిగి ఉండేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 15-20 నిమిషాల్లోనే దుకాణాలన్నింటిని మంటలు కమ్మేశాయి. నిత్యం వేల సంఖ్యలో జనం ఎగ్జిబిషన్‌కు తరలి వస్తున్నారు. సందర్శకులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టైంది.ఎగ్జిబిషన్ ఆవరణలో ఉన్న దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడంతో దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి దుకాణాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలో వాటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
![]() |
![]() |