వైఎస్సార్‌సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. అయితే హఠాత్తుగా ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.
రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
![]() |
![]() |