ప్రకాశం జిల్లాలో ఆరేళ్లలోపు బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో జాప్యం చేస్తే సహించబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలు ప్రకాశం భవన్‌లోని గ్రీవెన్స్ హాలులో బుధవారం స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆధార్ కార్డులేని పిల్లలకు వాటిని తక్షణమే జారీ చేసేందుకు నిర్వహిస్తున్న శిబిరాలపై దిశానిర్దేశం చేశారు. పనితీరు అధ్వానంగా ఉన్న సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఐసీడీఎస్ పీడీ హెనా సుజన్‌ను ఆదేశించారు. నెట్‌వర్క్ సరిగా రావడం లేదని, గిరిజన ప్రాంతమని, మిషన్ పనిచేయడం లేదని సాకులు చెప్తూ ఇతర శాఖలపై నెపం మోపేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట్ల కూడా కొందరు సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందన్నారు. సాకులు చెప్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఆధార్ శిబిరాల నిర్వహణ ప్రధాన బాధ్యత ఐసీడీఎస్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, పోస్టల్ అధికారుల సహకారం తీసుకొని సమన్వయంతో ఈ శిబిరాలను నిర్వహించాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికి తక్షణమే ఆధార్ కార్డుల జారీ కోసం వివరాలు నమోదు చేయాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి తొలుత వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రోజువారీ నివేదికలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
![]() |
![]() |