అరెస్టు ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సినవారే చీడ పురుగుల్లా తయారయ్యారని, నాయకుడు మంచోడైతే సమాజానికి మంచి జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్ద పెద్ద మహానుభావులు పుట్టిన నేలపై వల్లభనేని వంశీ పుట్టి ఈ నేలను అపవిత్రం చేశారన్నారు. గత 10 సంవత్సరాల నుంచి గన్నవరంలో మట్టిని అక్రమంగా తరలించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే వంశీ దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సభ్య సమాజం తల దించుకునేలా వంశీ ప్రవర్తన ఉంటుందని, వంశీలో ఏం చూసి జగన్ పార్టీలోకి తీసుకున్నాడో తెలియదన్నారు. నేడు ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు హోదా పోగొట్టడానికి రాజీ పడమంటే నేను రాజీ పడలేదని తెలిపారు. తనకు క్యారెక్టర్ ముఖ్యమని చెప్పానని, జగన్ ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తారన్నారు. 2014, 2019లో పోటీ చేసిన డాక్టర్ రామచంద్ర గానీ, తాను గానీ ఎప్పుడూ బూతులు మాట్లాడలేదన్నారు. తాము పోటీ చేసినప్పుడు ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. తనపై అనేక నిరాధార నిందలు మోపారని, గన్నవరంలో 400 మంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలికొదిలి వంశీని జగన్ పార్టీలోకి తీసుకున్నాడన్నారు. వైసీపీలో అవమానాలు మోయలేక తాను పార్టీ మారినట్లు చెప్పారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసేయాలనే వంశీని జగన్ పార్టీలోకి తీసుకున్నాడని తెలిపారు. ఆయనకు రౌడీలంటే ఇష్టమని, వల్లభనేని వంశీ కూడా ఒక రౌడీ కాబట్టి అతడిని జగన్ తన పార్టీలోకి చేర్చుకున్నాడని విమర్శించారు. వంశీ అక్రమ లే అవుట్లతో కామన్ సైట్లన్నీ అన్యాక్రాంతం చేశాడని ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలంలో రోడ్లకు అనుకొని ఉన్న భూములను కార్పొరేషన్ లో లేకుండా చేశారని, రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లే అవుట్ లో కూడా కామన్ సైట్ వాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చి అన్ని కబ్జాలు చేశారని మండిపడ్డారు. బ్రహ్మానంద చెరువు, పోలవరం మట్టిని అమ్ముకున్న పాపం ఊరికే పోదని, అది శాపంలా వెంటాడుతుందని వంశీకి నేను పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. పోలవరం మట్టిని తవ్వడం వల్లనే అంబాపురం వద్ద ఇటీవల బుడమేరు పొంగి విజయవాడను ముంచాయన్నారు. ఎయిర్ పోర్టు భూముల్లో కూడా వంశీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకుడైన తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైటర్ ను అడ్డం పెట్టుకొని అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడాడని ఆరోపించారు. పదేళ్లుగా ఎమ్మార్వోలుగా పనిచేసిన వారిమీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు తాను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతానన్నారు. మాధురి, పాత ఎమ్మార్వో నరసింహులు ఇద్దరు కలిసి ట్యాంపరింగ్ చేయని రికార్డులు లేవన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు వంశీ కోసం పనిచేసిన వారి మీద వంశీ అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నరసయ్య ఇంటిపై దాడి చేసిన మాట వాస్తవం కాదా? రంగబాబు కాళ్లు విరగ్గొట్టిన మాట వాస్తవం కాదా? అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు.
![]() |
![]() |