అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీది అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని వైసీపీ నాయకులంటున్నారని, అక్రమ అరెస్టులకు, కక్ష సాధింపుల విషయంలో వైసీపీ నాయకులకు సాటి ఎవరూ లేరన్నారు. చంద్రబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. 2023 లో గన్నవరం టీడీపీ ఆఫీసులో సమావేశం జరుగుతుంటే వంశీ నాయకత్వంలోని అల్లరి మూకలు పార్టీ ఆఫీసుపై దాడి చేశారన్నారు. ఆ సమయంలో కార్లు తగలబెట్టి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తే సత్యవర్ధన్ ఫిర్యాదు చేస్తే నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. పైగా ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ ఆఫీసునయితే... కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ నాయకులూ, కార్యకర్తల పైన ఇంత కన్నా అన్యాయమేంటని ప్రశ్నించారు. ఆడవారిపై కూడా కేసులు బనాయించి నిర్బంధంలో ఉంచిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. ఆఫీసులో పని చేసే షెడ్యూల్ కులానికి చెందిన సత్యవర్ధన్ దాడిపై ఫిర్యాదు చేస్తే ఆ కంప్లైంట్ ని బలహీనపరిచేందుకు అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి సాక్ష్యాలను తయారు మారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. కిడ్నాప్ పై సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు చేసిన కంప్లైంట్ కి వంశీని పోలీసులు అరెస్ట్ చేసారన్నారు. దళితుల్ని కిడ్నాప్ చేసి బెదిరించి, లొంగదీసుకుని కేసుని తారుమారు చేయాలని చూసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం సాక్షుల్ని బెదిరించడం తీవ్రమైన నేరమని, అక్రమ కేసులని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు వారిని మించిన అక్రమార్కులు ఎవరూ లేరన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ దుర్మార్గాలకు అంతే లేదన్నారు. పోలవరం కాల్వపై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేశారని దుయ్యబట్టారు. బ్రహంలింగం చెరువులోని మట్టిని తవ్వేసి అమ్ముకుని, ఎయిర్ పోర్టు భూముల్ని కూడా వదలకుండా తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పట్టాలిచ్చి ప్రజలని మోసం చేసిన దుర్మార్గుడు వంశీ అని అన్నారు. వంశీ హయాంలో గన్నవరంలో 4వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వంశీ చేసిన దుర్మార్గాలు, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానమేనని, చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. వైసీపీ నాయకులు అక్రమ అరెస్టులని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. లోకేశ్ ప్రజాస్వామ్య పద్దతిలో పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించి తనపై, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకటరావులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు పెట్టే సంస్కృతి వైసీపీదే అని కొనకళ్ల నారాయణ దుయ్యబట్టారు.
![]() |
![]() |