ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఆశించిన స్కోర్ రాలేదని తీవ్ర నిరాశకు గురైన ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. తన తల్లిదండ్రుల నమ్మకం వమ్మైందని, వారి కలను నెరవేర్చలేకపోయానని కలత చెందిన ఆ విద్యార్ధి.. సూసైడ్ నోట్ రాసిపెట్టి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తనను క్షమించాలని అమ్మానాన్నలకు చెప్పిన ఆమె చివరి మాటలు కంటతడిపెట్టిస్తున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. సంత్ కబీర్ నగర్ జిల్లా మిశ్రౌలియా గ్రామానికి చెందిన బాలిక అదితి మిశ్రా (18).. గోరఖ్‌పూర్‌లోని మూమెంటమ్ కోచింగ్ సెంటర్‌లో ఐఐటీ-జేఈఈ కోసం శిక్షణ కోసం చేరింది.
గత రెండేళ్లుగా జేఈఈకి సిద్ధమవుతోన్న ఆ బాలిక.. గర్ల్స్ హాస్టల్‌లో మరో విద్యార్ధినితో కలిసి ఉంటోంది. మంగళవారం రాత్రి ఫలితాల విడుదల కాగా... అర్హత సాధించకపోవడంతో అదితి నిరాశ చెందింది. బుధవారం ఉదయం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మాట్లాడిన ఆమె.. తన మొబైల్‌కు రీచార్జ్ చేయమని తండ్రికి చెప్పింది. తీవ్రంగా కలత చెందిన బాలిక.. తన రూమ్మెట్ ఆ సమయంలో బయటకు వెళ్లడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేటి తర్వాత తిరిగొచ్చిన ఆమె స్నేహితురాలు.. తలుపు తట్టి పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానించి కిటికీలో నుంచి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది.
వెంటనే హాస్టల్ వార్డెన్‌కు విషయం చెప్పడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. బలవంతంగా తెలుపు తెరిచి లోనికి ప్రవేశించారు. అప్పటికే అదితి చనిపోయినట్టు గుర్తించారు. గదిలో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘‘అమ్మానాన్నా నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను.. ఈ రోజుతో మన బంధం ముగిసిపోయింది.. మీరు నాకోసం ఏడవకండి... నన్ను ఎంతగానో ప్రేమించారు.. మీ కలను నేను నెరవేర్చలేకపోయాను... చెల్లిని బాగా చూసుకోంది.. అది తప్పకుండా మీ కలలను పండిస్తుంది.. మీ ప్రియమైన కుమార్తె అదితి’’ అని ఆమె రాసింది. ఈ నోట్ ప్రతి ఒక్కర్నీ కన్నీళ్లుపెట్టిస్తోంది. కేసు నమోదుచేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆమె మరణానికి కారణం ఏంటనేది పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడవుతుందని గోరఖ్‌పూర్ సిటీ ఎస్పీ అబినవ్ త్యాగి పేర్కొన్నారు.
![]() |
![]() |