పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైయస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నర్సారావుపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన మాట్లాడుతూ........పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైయస్ఆర్ సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
వైయస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గంకు చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్ గా దళిత సామాజిక వర్గంకు చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం. గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైయస్ఆర్సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైయస్ఆర్ సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది. గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్ లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్ళీ వాయిదా వేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం అని అన్నారు.
![]() |
![]() |