నెల్లూరు జిల్లాలోని టీపీ గూడూరు మండలం పేడూరులో పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) పైపు లైను నిర్మాణం పనులు సాగుతున్నాయి. విషయం తెలిసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం ఉదయం అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతేకాకుండా పొలాలను ధ్వంసం చేస్తూ పైపు నిర్మాణం చేపట్టడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. పంట చేతికొచ్చే సమయంలో 18 మీటర్ల వెడల్పున పైరుని తొక్కేయడం సరికాదన్నారు. వరికోతలు పూర్తయ్యేంత వరకు వేరే చోట పనులు చేసుకోవాలని అన్నారు. కృష్ణపట్నం - హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
మార్చి 15వ తేదీ నాటికి వరికోతలు దాదాపుగా పూర్తవుతాయని తెలిపారు. 2002లో రైతులకు బీపీసీఎల్ నోటీసులిచ్చిందన్నారు. అధికారులు ఇప్పుడొచ్చి చదరపు మీటరు పంటకి రూ.30 వేలు పరిహారం ఇస్తామంటూ పైరును ధ్వంసం చేయడం సరికాదన్నారు. 18 మీటర్ల వెడల్పున జరుగుతున్న పైపులైను నిర్మాణ పనుల కారణంగా పొలాల మధ్య సాగునీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.ఎకరాకి రూ.35 వేలు వరకు పెట్టుబడి పెట్టారని... కౌలు రైతులు ఎకరాకు రూ.30 వేలు చెల్లించారని తెలిపారు. సీజన్‌కు ముందే పొలాల్లో మార్కింగ్ చేసి ఉంటే, రైతులు పంటలు వేసేవారు కాదని చెప్పుకొచ్చారు. కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్ కో, సెంబర్ కార్ప్ తదితర ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఎస్.ఈ.జెడ్‌లకు వేలాది ఎకరాలు సేకరించినా రైతులు సహకరించారన్నారు. అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరించడం బాధాకరమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
![]() |
![]() |