ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల తొలగింపు పై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 06:54 PM

ఓట్ల తొలగింపు పై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని, వదంతులను నమ్మవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు తెలియచేసారు. మంగళవారం వెలగపూడి 5వ బ్లాక్¬లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తప్పుడు మార్గాల్లో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. ఓటర్లకు తెలియకుండా రాష్ట్రంలో ఏ ఒక్క ఓటరు  ఓటును తొలగించడం గతంలో జరగలేదని ఇక ముందు కూడా జరగబోదని ఆయన తెలిపారు.
కొందరు ఓటర్లకు ఓట్లు ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా ఫారం-7 ద్వారా ఆన్¬లైన్ పద్ధతిలో వేలాది సంఖ్యలో సామూహికంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విధంగా వచ్చే దరఖాస్తుల ద్వారా ఓట్ల తొలగింపులు చేయడం జరగదని రాష్ట్రంలోని ఓటర్లందరికీ మరొకసారి హామీ ఇస్తున్నామన్నారు. సమగ్ర విచారణ, తనిఖీ జరిపిన తర్వాత మరియు దరఖాస్తు వాస్తవికతను నిర్ధారించిన తర్వాత మరియు ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదించిన తర్వాత మాత్రమే ఎవరేని ఓటరు పేరును జాబితా నుండి తొలగిస్తామని తెలిపారు. ఎఫ్.ఐ.ఆర్¬ల నమోదు చేపట్టిన  తరువాత ఇప్పడు వచ్చే దరఖాస్తులు రోజుకు 1000కి పరిమితమయ్యాయని ఆయన తెలిపారు.
ఫారం-7 ధరఖాస్తుల పరిశీలనకు 10 నుండి 12 రోజులు సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో      40 వేల ఓట్లు తొలగించడానికి సిఫారసు చేసామని ఇవి డూఫ్లికేట్, మరణించిన వారి పేర్లు అని తెలిపారు. ఓట్ల తొలగింపు పై ఫిర్యాదులు అందిన కేసులలో తప్పుడు ధరఖాస్తులు సమర్పించిన వారిపై ఎఫ్.ఐ.ఆర్¬ల¬ను దాఖలు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లను కోరడమయిందని, 2 రోజుల క్రితం వరకు 45 కేసులను నమోదు చేయడం జరిగిందని, ఈ రోజుకు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
క్షేత్ర స్ధాయిలో 3 దశల్లో ప్రతి దరఖాస్తును పరిశీలన చేసిన తరువాతనే ఓట్ల తొలగింపు చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషను కఠిన చర్యలను తీసుకోవడానికి వీలుగా, అట్టి అనుచిత వ్యక్తులను గుర్తించడంలో పోలీసులు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవడానికి వీలుగా ఐపి చిరునామాలను నిర్ధారించడం కోసం సి-డాక్¬కు లేఖ వ్రాసామని తెలిపారు. ఓటరు ఫోటోలేని, ఓటరు జాబితాల పిడిఎఫ్¬లను మాత్రమే పబ్లిక్ డొమైన్-లో ఉంచుతామని ఆయన తెలియచేసారు.
నామినేషన్¬లు దాఖలుపరిచే చివరి రోజు వరకు ఓటర్లుగా నమోదు చేసుకొనే అవకాశం ఉందని, ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఓటర్లు వారి ఓటు ఉందో లేదో www.nvsp.in వెబ్¬సైట్¬లోగాని, 1950 నెంబర్¬కు ఫోన్ చేసి గాని పరిశీలించు కోవాలన్నారు. ఒకవేళ ఓటు లేకపోతే ఫారం-6 ద్వారా వెంటనే ఆన్¬లైన్¬లో దరఖాస్తు చేసుకోగలరన్నారు. చివరి సమయం వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 
జనవరి, 11 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 69 లక్షల పైగా ఓటర్లు ఉన్నారని, నేటికి 3 కోట్ల 76 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇప్పటికే 7 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు కాబడ్డారని ఇంకా 2019, జనవరి, 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa