ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టి.. దానికి ప్రతీకారం తీర్చుకుంటా.

international |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:17 PM

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఉగ్రవాది అంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో.. హసీనా వర్చువల్‌గా హాజరయ్యారు. ఈసందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. తాను తిరిగి బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడతానని, పార్టీ కార్యకర్తల హత్యలకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. గతేడాది ఆగస్టులో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కారణంగా పదవిచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.


‘అవామీ లీగ్‌ పార్టీ నాయకులు సహనం, ఓర్పుతో ఐక్యంగా ఉండాలి... నేను నా దేశానికి తిరిగి వస్తా. పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా.. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తాను. గతేడాది జులై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయినవారు పోలీసుల కాల్పుల వల్ల చనిపోలేదు. ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. విద్యార్థుల ఆందోళనల్లో అనేక మంది పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, మేధావులు, కళాకారులు హత్యకు గురయ్యారు... అయినా వారిపై యూనస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు.


దేశాన్ని నడిపించడంలో తనకు ఎలాంటి అనుభవం లేదని గతంలోనే అతడు అంగీకరించారు.. అన్ని దర్యాప్తు కమిటీలను రద్దు చేసి బంగ్లాదేశ్‌ను సర్వనాశనం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులపై దాడులు చేయడం యూనస్‌ అసమర్థతకు నిదర్శనం.. పక్కా ప్లాన్‌తో నా తండ్రి, బంగ్లా జాతిపిత ముజబూర్ రెహ్మాన్ ఇంటిని నాశనం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. దేశంలో హింసకు అడ్డుకట్టపడలేదు.. ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయింది.. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి.. ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’ అని హసీనా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో మృతిచెందిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా మాట్లాడారు.


‘అల్లాహ్ నాకు రెండో జీవితాన్ని ఇచ్చారు.. ఇందుకు బలమైన కారణం ఉంటుందని నేను నమ్ముతున్నాను.. గతంలోను నన్ను చంపడానికి ప్రయత్నించారు.. ఆగస్టు 5న కూడా హత్యాయత్నం జరిగింది.. కానీ, త్రుటిలో తప్పించుకుని బయటపడ్డాను..ఇక దేశానికి తిరిగి రావడమే ఉంది.. నేను న్యాయం చేస్తా.. అల్లాహ్ మనకు అండగా ఉంటారు’ అని హసీనా వ్యాఖ్యానించారు.


మరోవైపు, హసీనాతోపాటు ఆమె క్యాబినెట్‌లోని నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఇదే సమయంలో డెవిల్ హంట్ పేరుతో వేర్పాటువాదులు, చట్ట ఉల్లంఘనకు పాల్పడేవారి ఏరివేత ఆపరేషన్ ప్రారంభించినట్టు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. హసీనా హయాంలో పనిచేసిన 41 మంది పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది. విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారంటూ 1059 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa