ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు ఎవరు పోటీ చేస్తారో...ఎవరు చేయాలో తెలియని గందరగోళం...ఇదీ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి. ఈ సీటు ఎవరికి ఇస్తారోననే విషయమై కొద్ది రోజుల క్రితం వరకూ కాస్తోకూస్తో స్పష్టత ఉన్నా... ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలుత దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్‌ల మధ్య పోటీ నెలకొనగా ఒకరికి అసెంబ్లీ, మరొకరికి పార్లమెంటరీ సమన్వయకర్తలుగా అధిష్ఠానం నియమించడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి పార్టీలో చేరడంతో మరోసారి టిక్కెట్ వివాదం తెరపైకి వచ్చింది. మరోవైపు సినీ నిర్మాత బలగ ప్రకాష్ కూడా ఇదే సీటు కోసం పావులు కదుపుతుండడం... ముఖ్య నాయకుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం వైసీపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బలమైన ప్రత్యర్థిగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడి ఓటమే ధ్యేయంగా ఎన్ని అభ్యంతరాలున్నా కిల్లి కృపారాణిని పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత జగన్. బలమైన సామాజికవర్గ ప్రతినిధి కావడం... రాజకీయ అనుభవం ఉండడంతో కృపారాణి చేరికకు పచ్చజెండా ఊపారు. తద్వారా టెక్కలిలో విజయం సాధించాలనేది వైసీపీ అధినేత వ్యూహం. కానీ తాజా పరిణామాలతో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. నాలుగున్నరేళ్లుగా వ్యయప్రయాసలకోర్చి.. పార్టీని నడిపిస్తున్న సమన్వయకర్త పేడాడ తిలక్ డైలమాలో పడ్డారు. కృపారాణి పార్టీలో చేరిన నాటి నుంచి కార్యక్రమాల జోరు తగ్గించారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ కన్వీనర్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సైతం సొంత నియోజకవర్గమైన టెక్కలికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో పర్యటనకే పరిమితమవుతున్నారు. కృపారాణి కూడా ఇప్పటి వరకూ వేగం పెంచినట్టు కనిపించడం లేదు. ఇలా నాయకులు తలోదారిన వెళుతుండడంతో కార్యకర్తలు, అభిమానులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఎవరికి టిక్కెట్ దక్కుతుందో..ఎవరి వెంట నడవాలోననే సందిగ్ధంలో పడ్డారు.
అందరినీ కలుస్తున్న బలగ-
ఇప్పటికే ముగ్గురు నేతల మధ్య సీటు కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉండగా..మరోవైపు సినీ నిర్మాత, దళిత యువనేత బలగ ప్రకాష్ కూడా టెక్కలి వైసీపీ సీటు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న సత్సంబంధాలతో ముఖ్య నాయకులను, కార్యకర్తలను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీల వద్దకు వెళ్లి మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. టిక్కెట్ ఎవరికి వచ్చినా ఫర్వాలేదు..అందరం కలిసి పనిచేసి గెలిపించుకుందాం అంటూ ఐక్యతారాగాన్ని వినిపిస్తున్నారు. కానీ వైసీపీలో నెలకొన్న తాజా పరిస్థితితో శ్రేణులతో పాటు సానుభూతిపరులు, తటస్థులు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇటువంటి వారి వద్దకు వెళ్లి పార్టీలో కొనసాగేలా ఒత్తిడి తెచ్చి నిలువరిస్తున్నారు.
మనసులు కలిసేనా?
టెక్కలి నియోజకవర్గంలో సామాజికవర్గపరంగా కాళింగ సామాజిక వర్గం వారు అధికం. సుమారు 68 వేల మంది ఓటర్లు ఉన్నారు. టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా టిక్కెట్ ఆశిస్తున్న వారంతా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు. వారంతా ఒకే పార్టీ గూటికి చేరినా.. మనసులు కలవలేదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ అధినేత అనుకున్నది సాధించడం కష్టం. అదే సమయంలో ఇతర సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో శ్రేణులు కూడా ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నాయి.
కృపారాణి ఆహ్వానించినా...వైసీపీలో చేరడానికి ముందు కిల్లి కృపారాణి జిల్లాలోని నాయకులందరినీ కలిశారు. జగన్ సమక్షంలో చేరుతున్నానని..అందరూ రావాలని కోరారు. కానీ ఆమె పార్టీలో చేరినప్పుడు టెక్కలి అసెంబ్లీ సమన్వయకర్త తిలక్ కానీ, పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ కానీ కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా నుంచి ఒక్క ధర్మాన కృష్ణదాస్ మినహా మరే ఇతర నాయకులు కనిపించకపోయే సరికి ఆ పార్టీ కార్యకర్తలు కొందరిలో అయోమయం నెలకొంది. ఓవైపు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్య ఉండే పేరాడ తిలక్ సైతం మునుపటి ఉత్సాహం చూపించకపోవడం చూస్తుంటే టెక్కలి నియోజకవర్గ వైసీపీలో ఏదో జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు నేతలు సీటు కోసం పోటీ పడుతుండడం...మరోవైపు తెరపైకి కొత్త వ్యక్తి రావడం... అసలు వీరిలో ఎవరి వెంట నడవాలనే విషయంలో అధిష్ఠానం నుంచి స్పష్టత లేకపోవడంతో కార్యకర్తలూ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ దశాదిశా లేకుండా నడుస్తున్న ఇక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రత్యర్థి అచ్చెన్నాయుడును వైసీపీ ఎంతవరకు ఎదుర్కొంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa