ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ పయనమెటో!పోటీపై స్పష్టత కరువు-గుంభనంగా కేడర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 10:14 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలో ఇప్పటికే హడావుడి మొదలైంది. కాంగ్రెస్‌లోనూ టిక్కెట్లపై కుస్తీ పడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఎలాంటి సన్నద్ధత కనిపించడం లేదు. ఈ పార్టీకి జిల్లాలో కనీస స్థాయిలో పట్టు లేదన్నది పరిశీలకుల మాట. ఇప్పటివరకూ టిక్కెట్లకు సంబంధించి బీజేపీ జిల్లా నేతలూ ఏ విషయాన్నీ ప్రకటించలేదు. తమ భవిష్యత్తు వ్యూహమేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆ పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నా జిల్లాకు వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నం. జిల్లాలో ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ బోణీ కొట్టలేదు. గత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఒక్క సీటు కూడా మన జిల్లాలో కేటాయించలేదు. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థులనే బరిలోకి దింపింది. అయితే 2004లో మాత్రం వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా జిల్లాలోని చివరి నియోజకవర్గం కురుపాం(నాగూరు) సీపీఎంకు కేటాయించారు. టీడీపీ మద్దతుతో కోలక లక్ష్మణ మూర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది తప్పితే పొత్తులతో మన జిల్లాలో సీట్లు కేటాయించి గెలుపొందడం అన్నది లేదు. ఇదిలా ఉంటే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ నేటికీ కనీసం సర్పంచి స్థానంలో కూడా ప్రాతినిధ్యం వహించని పరిస్థితి ఉంది. అంతే కాకుండా జిల్లాలో పటిష్టమైన కేడర్‌ను ఏనాడూ తయారు చేసుకోలేకపోయింది. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు జిల్లాలో 2014వరకు బలమైన నాయకత్వం ఉండటం.. ప్రాంతీయ పార్టీగా టీడీపీ గ్రామ స్థాయి నుంచి బలమైన కేడర్‌తో స్థిరంగా ఉండడం.. తదితర కారణాలతో మూడో పార్టీకి జిల్లాలో పట్టు పెంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బీజేపీకి యువ నాయకత్వం కరువు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇటీవల వరకు బీజేపీ పైకి రాలేదు. ఇపుడు ఇతర పార్టీలతో విభేదించి స్వయంగా జనాల్లోకి వెళ్లే వెసులబాటు బీజేపీకి ఉన్నా చురుకైన నాయకత్వం లేదు. దీంతో జిల్లాలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. టీడీపీపై ఉన్న కక్షతో రాష్ట్ర నాయకత్వం చెప్పి చూసినా రాష్టా్ట్రనికి విభజన హామీలను నెరవేర్చేందుకు మోదీ ముందుకు రాలేదు. అంతే కాకుండా ఉపాధి హామీ, వెనుకబడిన జిల్లా నిధులకు సైతం ఇబ్బందులు పెడుతోంది. ప్రత్యేక హోదా పక్కన పెడితే రైల్వే జోన్‌ అంశం బీజేపీకి ఉత్తరాంధ్రలో మరింత మైనస్‌ను తెచ్చి పెట్టింది. చారిత్రక విశాఖ డివిజన్‌ను ఎత్తివేయటంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో జోన్‌ ప్రకటించి మరింత మైనస్‌ను మూట గట్టుకుంది. 
 పొత్తుపైనే అధారం-ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలన్నది పార్టీకి అంతుచిక్కని పరిస్థితిగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే చెప్పలేం కాని స్వయంగా పోటీలోకి దిగినా జిల్లాలో ఒక్క సీటు కూడా కైవసం చేసుకునే పరిస్థితి అయితే బీజేపీకి లేదనేచెప్పాలి. పొత్తు గురించి కూడా ఈనెల 12న తేలిపోతుందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో నిర్దిష్టంగా అభ్యర్థులను ప్రకటించ లేదు. అయితే ఈనెల 12న ముహూర్తంగా బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతమున్న కన్వీనర్లకే పార్టీ టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్‌కు పార్టీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాశిరాజు, అసెంబ్లీకి అచ్చిరెడ్డి, ఎస్‌.కోట బీవీకే ప్రసాద్‌, నెల్లిమర్ల పతివాడ రమణ, చీపురుపల్లి శంకర్‌లాల్‌ శర్మ, గజపతినగరం దేవర ఈశ్వరరావు, బొబ్బిలి పెద్టింటి రామస్వామి, సాలూరు గంటా అప్పలనాయుడు, పార్వతీపురం పట్లాసింగి రవికుమార్‌, కురుపాం నియోజకవర్గానికి కన్వీనర్‌గా నిమ్మక జయరాజ్‌లు బాధ్యతలు వహిస్తున్నారు. ఎక్కువ శాతం అవకాశాలు వీరికే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 12న అభ్యర్థుల ప్రకటన చేసిన తరువాత ఏవిధంగా ముందుకు సాగుతారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa